ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు పెట్టుకున్న బంగారంలో తమిళ, తెలుగు కుటుంబాలదే ఎక్కువ
Amaravati, August 10: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి ప్రజలు తీసుకున్న రుణాల మొత్తం రూ. 11.49 లక్షల కోట్లు. అందులో దక్షిణ భారతం వాటా రూ. 9.09 లక్షల కోట్లు. అంటే… 79.14 శాతం. 20 శాత కంటే తక్కువ జనాభా ఉన్న దక్షిణ భారత దేశంలోని కుటుంబాలు సుమారు 80 శాతం బంగారం రుణాలు తీసుకోవడం అసాధారణం!
2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బంగారం తాకట్టు రుణాలు రూ. 11,49,411 కోట్లకు చేరాయి. రాష్ట్రాల వారీగా చూస్తే… అగ్ర స్థానంలో ఉన్న ఐదూ దక్షిణాదివే! తమిళనాడు రూ. 4,11,656 కోట్ల రుణాలతో దేశంలోనే అగ్ర స్థానంలో ఉండగా, పెద్ద తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రూ. 2,22,953 కోట్ల రుణాలతో రెండో స్థానంలో నిలిచింది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ రూ. 92,394 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి బంగారు రుణాల భారం రూ. 3,15,347 కోట్లు. తెలంగాణకు ముందు కర్ణాటక రూ. 98,962 కోట్ల రుణాలతో మూడో స్థానంలో ఉండగా, తర్వాత కేరళ రూ. 83,657 కోట్ల బంగారు రుణాలతో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. ఈ ఐదు రాష్ట్రాల మొత్తం బంగారు రుణ భారం రూ. 9,09,622 కోట్లు.
ఈ మొత్తాలు ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSBల)లో తీసుకున్నవి మాత్రమే. ప్రైవేటు బ్యాంకులు, ముత్తూట్ ఫైనాన్స్, ఐ.ఐ.ఎఫ్.ఎల్., మణప్పురం గోల్డ్ వంటి NBFCలు, గ్రామీణ- సహకార బ్యాంకులలో తీసుకున్న బంగారు రుణాలు మరికొన్ని లక్షల కోట్లు. ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ వంటి సంస్థలు దక్షిణాదిలోనే పుట్టాయనే విషయం తెలిసిందే. PSBల తరహాలోనే మిగిలిన ఆర్థిక సంస్థల బంగారు రుణాలు కూడా దక్షిణాదిలోనే ఎక్కువ.
దక్షిణాదిని మినహాయిస్తే… మిగిలిన 23 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు కలిపి (PSBలలో) తీసుకున్న బంగారు రుణాల మొత్తం కేవలం రూ. 2.39 లక్షల కోట్లు. ఇది… ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోని కుటుంబాలు తీసుకున్న బంగారు రుణాల మొత్తానికి దాదాపు సమానం. జనాభాలో దాదాపు దక్షిణ భారతమంత ఉన్న ఉత్తరప్రదేశ్ లోని కుటుంబాల బంగారం రుణాలు కేవలం రూ. 21,745 కోట్లు. ఇది ఆంధ్రప్రదేశ్ బంగారం రుణ భారంలో 10వ వంతు కంటే తక్కువ.
దేశంలోని బంగారం అంతా దక్షిణాదిలోనే ఉందా?
దక్షిణాది ప్రజలే బంగారం ఎక్కువ కొనుగోలు చేస్తారని, బంగారు ఆభరణాలు చేయించుకోవడం ఆ సంస్కృతిలో భాగమని, బ్యాంకింగ్ విస్తరణ దక్షిణ భారతంలోనే ఎక్కువ కాబట్టి రుణ వితరణ కూడా అంతే ఉంటుందని కొన్ని విశ్లేషణలు చెబుతుంటాయి. అయితే, ఇవి పాక్షికమైనవి. దేశం మొత్తం ప్రజల వద్ద ఉన్న బంగారంలో దక్షిణాది కుటుంబాల వాటా సుమారు 40 శాతం. ఇది సాపేక్షంగా ఎక్కువే అయినా, దానితో పోలిస్తే రుణ భారంలో దక్షిణాది వాటా చాలా ఎక్కువ.
దేశవ్యాప్తంగా బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రజలు తీసుకున్న రుణాల మొత్తంలో దక్షిణ భారత కుటుంబాల వాటా దాదాపు 80 శాతం అయితే… 80 శాతం పైగా (125 కోట్ల) జనాభా ఉన్న మిగిలిన దేశంలోని కుటుంబాలు తీసుకున్న రుణాలు కేవలం 20 శాతం. దేశ ప్రజల వద్ద ఉన్న బంగారంలో 40 శాతం (అంచనా) కలిగిన దక్షిణాది ప్రజలు 80 శాతం రుణాలు తీసుకుంటే, 60 శాతం బంగారం కలిగిన మిగిలిన ప్రాంతాల ప్రజలు 20 శాతం రుణాలు తీసుకోవడం ఓ స్పష్టమైన వైరుధ్యాన్ని సూచిస్తోంది.
కుటుంబ, వ్యాపార, వ్యవసాయ మనుగడకు బంగారం తాకట్టు పెట్టడం అనేది దక్షిణ భారత రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది. తద్వారా ఈ రాష్ట్రాల ప్రజలు బంగారు రుణాల ఊబిలోకి జారిపోతున్నారు. రుణ వితరణ ఎక్కువగా ఉంటే ఆయా రంగాలలో పెట్టుబడులకు, కుటుంబ మనుగడకు బంగారాన్ని తాకట్టుపెట్టవలసిన అవసరం ఉంటుందా?
తమిళనాట వ్యవసాయ రుణాలను దాటిన బంగారు రుణాలు
తమిళనాడులో ఈ ధోరణి చాలా ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాల కంటే… అవే బ్యాంకుల్లో బంగారాన్ని కుదువబెట్టి ప్రజలు తీసుకున్న రుణాల మొత్తమే ఎక్కువ. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి లేదు. ఆ విషయంలో తమిళనాడుకు దగ్గరగా ఉన్నది ఆంధ్రప్రదేశ్.
దేశం మొత్తం మీద ప్రజలు ప్రభుత్వ రంగ బ్యాంకులలో తమ బంగారాన్ని కుదువబెట్టి తీసుకున్న రుణాలలో ఒక్క తమిళనాడు వాటానే 35.81 శాతం. ఆంధ్రప్రదేశ్ వాటా 19.43 శాతం, కర్నాటక వాటా 8.61 శాతం, తెలంగాణ వాటా 8.04 శాతం, కేరళ వాటా 7.28 శాతంగా ఉన్నాయి. అదే సమయంలో… దేశ జనాభాలో సుమారు 17 శాతం కలిగిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వాటా బంగారు రుణాల్లో కేవలం 1.89 శాతం. బీహార్ వాటా అత్యంత తక్కువగా 0.50 శాతంగా ఉంది. దానర్థం… ఆ రాష్ట్రాల్లో బంగారమే లేదని కాదు కదా!
అత్యవసర నిధుల కోసం దక్షిణాది కుటుంబాలు మునుపెన్నడూ లేనంతగా పసిడిని కుదువబెడుతున్నాయి. ఈ విషయంలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య పెద్ద అగాథమే ఉంది.
బంగారం ధర పెరిగేకొద్దీ భారం తగ్గుతోందా!
బంగారం రుణాలపై ఓ ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమాధానంలో కొన్ని అంశాలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదు. బంగారం రుణాల్లో పారు బకాయిలు కేవలం 0.12 శాతంగా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. బ్యాంకులో పెట్టిన బంగారం తాకట్టును నిరంతరం కొనసాగించడం వల్ల ప్రస్తుతానికి డిఫాల్టర్లు తక్కువగా కనిపిస్తారు. అప్పుల చెల్లింపు కష్టమైనప్పుడు ఈ బకాయిలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఆస్తి (బంగారం) ధర పెరగడం వల్ల తిరిగి చెల్లించే సామర్ధ్యానికి ఢోకా లేదన్నది రిజర్వుబ్యాంకు సూత్రీకరణ. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఈ భరోసాకు భిన్నంగా ఉంది. బంగారం ధర తక్కువగా ఉన్నప్పుడు రుణం తీసుకొని ఏటేటా వడ్డీ కట్టేవారికి భారం పెరగదు. మరి అందరూ ఇలాగే చేస్తున్నారా? లేదు. పెరిగిన బంగారం విలువకు తగినట్టుగా రుణాన్నీ పెంచుకుంటూ పోతున్నారు. పాత రుణాన్ని, దానిపై వడ్డీని తీర్చగా ఇంకా కొంత సొమ్ము మిగిలేంతగా బంగారం ధర పెరిగింది. ఇలా తాకట్టును ఏళ్ళ తరబడి కొనసాగించడం, కొత్త ధరకు తగినట్టుగా అప్పును పెంచుకోవడం సాధారణమైంది. ఈ పరిస్థితి చాలా మందిని… తమ బంగారం ఎప్పటికీ విడిపించుకోలేని దుస్థితికి తీసుకెళ్లవచ్చు.
ప్రజలు తనఖా పెట్టిన బంగారం బ్యాంకుల వద్దనే ఉంటుంది కాబట్టి వాటికేం ఢోకా లేదు. బంగారాన్ని వేలం వేసైనా సొమ్ము రాబట్టుకుంటాయి. బంగారం ధర పెరిగినంత వేగంగా… తాకట్టు రుణాల మొత్తం పెరిగితే నష్టం ప్రజలకే!
