రూ. 15,993 కోట్ల అంచనా వ్యయంతో 75.3 కి.మీ. పొడవున నిర్మించ తలపెట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనా అందలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అధికార వైసీపీ ఎం.పి.లు ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ), బివి సత్యవతి (అనకాపల్లి) అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి కౌశల్ కిశోర్ లోక్ సభలో బదులిచ్చారు. 2018 సెప్టెంబరులో లైట్ మెట్రో ప్రాజెక్టు (42.55 కి.మీ) కోసం ప్రతిపాదన అందిందని, అయితే దానికి నిధులివ్వలేమని కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు తెలిపిందని వివరించారు.