కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర భారత రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్ధతుగా ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ గళమెత్తారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోకపోతే తన ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఆదివారం హర్యానా-ఢిల్లీ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతుల వద్ద మాట్లాడుతూ విజేందర్ ఈ ప్రకటన చేశారు.
ఇండియాలో క్రీడలలో ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం ‘ఖేల్ రత్న’. ఒలింపిక్స్ (2008)లో ఇండియాకు తొలి పతకం సాధించిన బాక్సర్ గా విజేందర్ ఖ్యాతి గడించారు. హర్యానాకు చెందిన ఈ క్రీడా దిగ్గజానికి 2009లో భారత ప్రభుత్వం ‘ఖేల్ రత్న’ను ప్రకటించింది. ఇప్పటికే అనేక మంది క్రీడాకారులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు రైతు ఉద్యమానికి మద్ధతు తెలిపి అవార్డులు వెనక్కి ఇస్తామని ప్రకటించారు. వారిలో ఎక్కువమంది పంజాబ్, హర్యానా రాష్ట్రాలవారు.
ఈ రోజు విజేందర్ మాట్లాడిన చోటనే నిన్న గాయకుడు దిల్జిత్ దోసాంఝ్ మాట్లాడారు. మరో రోజు ముందు బాక్సింగ్ దిగ్గజాలు కౌర్ సింగ్, జైపాల్ సింగ్, గుర్బక్ష్ సింగ్ సంధు అవార్డలు వాపస్ ప్రకటనలు చేశారు. మూడు రోజుల ముందు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ ఏకంగా ‘పద్మ విభూషణ్’ తిప్పి పంపుతున్నట్టు ప్రకటించారు.