Featured

జెపి నడ్డా వాహనశ్రేణిపై కోల్‌కతాలో దాడి.. నివేదిక కోరిన అమిత్ షా

బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా పశ్చిమ బెంగాల్ పర్యటనలో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. గురువారం కోల్‌కతాకు దగ్గర్లో నడ్డా వాహన శ్రేణిపై కొందరు దుండగులు ఇటుకలు, రాళ్ళతో దాడి చేశారు. ఇది బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ పనేనని బిజెపి ఆరోపించింది. నడ్డాకు భద్రతా లోపాల విషయమై బిజెపి నేతలు మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

బిజెపి నేతలు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బరుకు ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. డైమండ్ హార్బర్ లోక్ సభ నియోజకవర్గానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే అటుగా వెళ్తున్న బిజెపి కాన్వాయ్ పై దాడి జరిగిందని ఒక కథనం. బిజెపి నేతల కార్లు గుంపు మధ్యలో నుంచి వెళ్తుండగా పలువురు వాటి వెంట పరుగెత్తి చేతులతో, కర్రలతో, రాడ్లతో కొట్టారు. పలు మీడియా వాహనాలకు కూడా రాళ్లు తగిలాయి.

‘బుల్లెట్ ప్రూఫ్’తో సేఫ్: నడ్డా

దాడి తర్వాత తన గమ్యస్థానానికి చేరిన నడ్డా ‘‘ఈరోజు ఇక్కడికి చేరానంటే అది దుర్గా మాత దయే’’ అని వ్యాఖ్యానించారు. తాను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణిస్తున్నందున భద్రంగా బయటపడ్డానని, తమ పార్టీ నేతలు ముకుల్ రాయ్, విజయవర్గీయ గాయపడ్డారని నడ్డా చెప్పారు. బెంగాల్ రాష్ట్రంలో ఈ గూండా రాజ్యం అంతం కావాలని ఆయన వ్యాఖ్యానించారు.

అమిత్ షా సీరియస్

దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ‘ప్రాయోజిత హింస’గా పేర్కొన్న అమిత్ షా.. దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గవర్నరు జగదీప్ ధంఖర్ కు సూచించారు. దాడికి సంబంధించినవిగా చెబుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చెలామణి అవుతున్నాయి. ఒక కారు లోపల పడిన ఇటుకను చూపిస్తున్న వీడియో వైరల్ అయింది.

బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (ఫైల్)

నాటకం: మమతా బెనర్జీ

దాడి ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, ఇదంతా ‘‘ఉద్దేశపూర్వక కవ్వింపు’’ అని ప్రత్యారోపణ చేసింది. బెంగాల్ సిఎం, తృణమూల్ అధినేత్రి కూడా తీవ్రంగానే స్పందించారు. ‘‘బిజెపి కొత్త హిందూ ధర్మాన్ని (మతాన్ని) సృష్టిస్తోంది. అది ద్వేషపూరిత ధర్మం. హిట్లర్ ఇలాగే ఆవిర్బవించాడు. వారే సంఘటనలపై వీడియాలు సృష్టించి మీడియాకు పంపుతున్నారు. ఓ నాటకం సాగుతోంది. వాళ్లు పాకిస్తాన్ మాపైన దాడి చేస్తోందంటారు’’ అని విమర్శించారు.