ఫ్రాన్స్ డేటా ప్రైవసీ వాచ్ డాగ్ సిఎన్ఐఎల్ గురువారం రెండు గూగుల్ యూనిట్లకు 100 మిలియన్ యూరోలు, అమెజాన్ సబ్సిడరీకి 35 మిలియన్ యూరోలు జరిమానా విధించింది. వినియోగదారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా, సరైన సమాచారమూ ఇవ్వకుండా.. వారి కంప్యూటర్లలో వాణిజ్య ప్రకటనల ‘కుకీ’లను ఉంచినందుకు ఈ జరిమానాలు విధించినట్టు నియంత్రణా సంస్థ తెలిపింది.
ఎవరైనా వినియోగదారు google.fr వెబ్సైట్ ను సందర్శించినప్పుడు, వాణిజ్య ప్రకటనలకు ఉద్దేశించిన అనేక కుకీలు స్వయంచాలకంగా వారి కంప్యూటర్లలోకి చొరబడతాయని, వినియోగదారు ప్రమేయం లేకుండానే చొప్పించే ఈ కుకీలతో వారి మునుపటి బ్రౌజింగ్ వివరాలు తెలుసుకోవచ్చని సిఎన్ఐఎల్ పేర్కొంది.
amazon.fr వెబ్సైట్ ను సందర్శించినప్పుడు కూడా ఇదే జరుగుతోందని సిఎన్‌ఐఎల్ తెలిపింది. ఈ తరహా కుకీలను ‘‘యూజర్ సమ్మతి తెలిపిన తర్వాత మాత్రమే ఉంచవచ్చు’’నని, ముందస్తు అనుమతి పొందే విషయంలో సదరు వెబ్సైట్లు నిబంధనలను ఉల్లంఘించాయని స్పష్టం చేసింది. గోప్యతా సమాచారాన్ని సరిగ్గా అందించనందుకు గూగుల్ ను తప్పుపట్టింది.