Featured

రైతు భారత బంద్ ప్రశాంతం

పలు రాష్ట్రాల్లో మధ్యాహ్నం వరకు స్తంబించిన కార్యకలాపాలు

బిజెపి పాలిత రాష్ట్రాల్లో తక్కువ ప్రభావం

యూపీ, పంజాబ్ లలో రహదారుల మూసివేత

ప్రభుత్వంపై మరింత ఒత్తిడి

చర్చలకు ఆహ్వానించిన అమిత్ షా

కేంద్ర వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాల్సిందేనంటూ రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తర భారతంతో పాటు దక్షిణ భారతంలోనూ బంద్ గణనీయంగా ప్రభావాన్ని చూపింది. తూర్పు, పశ్చిమ రాష్ట్రాల్లో పలు రోడ్లు, రైలు మార్గాలు మూతపడ్డాయి. ప్రధానంగా పంజాబ్, హర్యానా రైతులు, వారితో జతకలసిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా పెద్ద ప్రభావాన్నే కలిగించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం నేలకు దిగి రైతు సంఘాల నేతలతో చర్చలు జరుపుతోంది.

మంగళవారం నిర్వహించిన బంద్ తో కేంద్రంపై ఒత్తిడి మరింత పెరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం సాయంత్రం కలుద్దామని రైతు నేతలకు ఆహ్వానం పంపారు. బుధవారం కేంద్ర మంత్రులు మరోసారి రైతు ప్రతినిధులతో చర్చలు జరపవలసి ఉండగా.. అంతకు ముందుగానే అమిత్ షా ఆహ్వానించడం గమనార్హం. అమిత్ షా ఆహ్వానించినా మరో మాట చెప్పేదేమీ లేదని, కేంద్ర చట్టాల ఉపసంహరించుకుంటారా లేదా అన్నది మాత్రమే అడుగుతామని రైతు నేతలు ఈ సమావేశానికి ముందు ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్, పంజాబ్ లలో ఆందోళన

బంద్ సందర్భంగా నిరసనకారులు గజియాబాద్, ఢిల్లీ రహదారిని దిగ్బంధించారు. సింగు రహదారి వద్ద మోహరించిన మరో టీమ్ అక్కడా రహదారిని మూసివేశారు. గాజీపూర్ వద్ద 24వ జాతీయ రహదారిని, పంజాబ్ లో చండీగఢ్ రహదారిని కూడా రైతులు మూసివేశారు.

తూర్పున బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ ఆందోళన

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైతుల బంద్ కు మద్ధతు తెలపలేదు. అయితే, ఆమె పార్టీ కేంద్రానికి నిరసన తెలుపుతూ కార్యక్రమాలు నిర్వహించింది. వామపక్షాలు రాష్ట్రమంతటా ర్యాలీలు నిర్వహించాయి. జాదవ్ పూర్ రైల్వే స్టేషన్ ను దిగ్భంధించాయి. లెఫ్ట్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, ఇతర జిల్లాల్లో పలుచోట్ల రైల్వే ట్రాక్ లను దిగ్బంధించారు. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం బంద్ పాక్షికంగా జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఉద్యోగులు బంద్ లో పాల్గొనడంతో బ్యాంకింగ్ రంగం ప్రభావితమైంది.

దక్షిణ భారతంలో నిరసనలు

దక్షిణ భారతాన పలు రాష్ట్రాల్లో బంద్ విజయవంతమైంది. బంద్ కు మద్ధతు ప్రకటించడమే కాకుండా పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునివ్వడంతో అధికార టిఆర్ఎస్ శ్రేణులు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మంగళవారం జరగాల్సిన ఉస్మానియా యూనివర్శిటీ పరీక్షలు వాయిదాపడ్డాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వం బంద్ కు మద్ధతు ఇచ్చింది. అయితే, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఆ రాష్ట్రంలో బంద్ కు మినహాయింపులు ఇచ్చారు.

తమిళనాట అధికార ఎఐఎడిఎంకె బంద్ పిలుపుకు స్పందించకపోయినా రాష్ట్రంలో క్యాబ్, ఆటో యూనియన్లు మద్ధతు ప్రకటించాయి. డిఎంకె, వామపక్షాల కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ప్రదర్శనలు చేపట్టారు. ఆయా పార్టీలకు చెందిన 1000కి పైగా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ పాలిత పుదుచ్ఛేరి ప్రభుత్వం బంద్ కు మద్ధతిచ్చింది. ముఖ్యమంత్రి నారాయణ స్వామి రైతులతో కలసి స్వయంగా ప్రదర్శనలో పాల్గొన్నారు.

బిజెపి పాలిత కర్నాటకలో కార్మిక సంఘాలు, దళిత సంఘాలు బెంగళూరులో రాస్తారోకో చేశాయి.

కేజ్రీవాల్ X ఢిల్లీ పోలీస్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఆ రాష్ట్ర పోలీసులే గ్రుహ నిర్బంధంలో ఉంచినట్టు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. సింగు సరిహద్దులో మోహరించిన రైతులను కలసి వచ్చాక కేజ్రీవాల్ ను పోలీసులు ఇంటి నుంచి కదలనివ్వలేదని ‘ఆప్’ ఆరోపించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాక ఈ చర్యకు పాల్పడ్డారని పోలీసులపై మండిపడింది. సిఎంను కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసులు కొట్టారని కూడా ఆప్ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ, మహారాష్ట్రలలో బంద్ పాక్షికంగా జరిగింది. మహారాష్ట్ర అధికార కూటమి మహా వికాస్ అఘాది బంద్ కు మద్ధతు ఇచ్చింది. ముంబైలోని వాసిలో ఉన్న అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ మూతపడింది. ముంబైలోనూ, ఢిల్లీలోనూ చాలావరకు షాపులు తెరిచే ఉన్నాయి. అయితే, ఢిల్లీ సరోజినీ నగర్ షాపు ఓనర్లు బంద్ కు మద్ధతుగా నల్ల రిబ్బన్లు ధరించారు.

ఆప్ కార్యకర్తలు మధ్య ఢిల్లీలోని రోడ్డును దిగ్బంధించారు. ఢిల్లీ పోలీసుల కేంద్ర కార్యాలయం ఉన్న ఆదాయ పన్ను శాఖ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో..

బిజెపి పాలిత గుజరాత్ లో ఎక్కువ షాపులు, మార్కెట్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు రోజంతా పని చేశాయి. గోవాలో ప్రజా రవాణా సాధారణంగానే ఉంది. బిజెపి కూటమి అధికారంలో ఉన్న హర్యానాలో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాలు జాతీయ రహదారులపై నిరసనలు తెలిపాయి. అస్సాం గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం షాపులు చాలావరకు మూతబడ్డాయి. త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో బంద్ పెద్దగా ప్రభావం చూపలేదు.

కేంద్ర చట్టాలపై సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలపై ఈ వారంలో సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నట్టు కేరళలోని వామపక్ష ప్రభుత్వం తెలిపింది.