ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేయడంలో అగ్రస్థానం కోసం పోటీ పడుతోంది. శుక్రవారం ఒక్కరోజే రూ. 4000 కోట్ల అప్పుకోసం బ్యాంకుల తలుపులు తట్టింది. ఈమేరకు ప్రభుత్వ స్టాక్స్ రిజర్వుబ్యాంకు ఇ-కుబేర్ వ్యవస్థ ద్వారా వేలం వేయడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 6వ తేదీన వేలం జరగనుంది. ఈ నాలుగు వేల కోట్లను విభిన్న కాల పరిమితులతో ఐదు వేర్వేరు మొత్తాలుగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
ఈ వారం వేలంలో మొత్తం 14 రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. ఆయా రాష్ట్రాలు కోరిన మొత్తం రూ. 26,710 కోట్లు. అందులో రూ. 5000 కోట్లతో మహారాష్ట్ర, రూ. 4000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రూ. 3000 కోట్ల చొప్పున కోరగా… మన పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ రూ. 2000 కోట్లు అడిగింది.
విభజన తర్వాత ఆదాయ లోటు నెలకొనడం, దాన్ని పూడ్చుకునే మార్గాలు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అప్పులపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలు, ద్రవ్య క్రమశిక్షణ లోపించడం వంటి కారణాలతో అప్పులు విపరీతంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పన్నుల ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు ఎఫ్.ఆర్.బి.ఎం. చట్ట పరిమితులను దాటి పోతున్నాయి. రిజర్వు బ్యాంకుకు సమర్పించే ఇండికేటివ్ కేలండర్ కు మించి మార్కెట్ రుణాలను తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాలపై వడ్డీ కూడా మిగిలిన పెద్ద రాష్ట్రాల కంటే అధికంగానే ఉంటోంది. రుణ పరపతి క్షీణతకు ఇదొక ఉదాహరణ. తాజాగా తీసుకునే రుణాలపై వడ్డీ ఎంతనేది 6వ తేదీన వేలంలో తేలుతుంది.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు సమర్పించిన వివరాల ప్రకారం… 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ. 69,716 కోట్లకు చేరాయి. చివరి త్రైమాసికంలో చేసే అప్పులు దీనికి తోడవుతాయి.
ఈ వారం ఆంధ్రప్రదేశ్ సేకరించే రుణ మొత్తాలు
1000 5
500 12
1000 15
500 17
1000 19