‘ఎయిమ్స్’ నిపుణుల నివేదిక
ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వ్యాపించాయి? అన్నది ఇంకా మిస్టరీనే
నీటి నుంచే అంటున్న నిపుణులు.. రాష్ట్ర ప్రభుత్వ భిన్న వాదనలు
హఠాత్తుగా రోడ్లపైనే పడిపోయినవారు కొందరు, నురగ కక్కుతూ గిలగిల కొట్టుకుంటూ మూర్ఛబోయినవారు మరికొందరు.. కారణం తెలియని వ్యాధికి గురైన వందల మంది ఆసుపత్రులకు పోటెత్తుతుంటే ఏలూరులో గత మూడు రోజులుగా నెలకొన్న భయానక వాతావరణం ఇది. వైద్య పరీక్షలలో అంతా సాధారణమే అని వస్తున్నా కళ్ళెదుటే ఒకరు మరణించారు. 500 మందికి పైగా ఆసుపత్రుల్లో చేరారు. మూర్ఛ వ్యాధి లక్షణాలు తగ్గాయని ఇంటికి వెళ్లినవాళ్లు మళ్లీ అస్వస్థతతో ఆసుపత్రులకు రావడమూ తటస్థించింది.
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కాలంలో.. ఈ హఠాత్పరిణామం ఏలూరును, ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ ను ఉలికిపడేలా చేసింది. కేంద్రమూ కలవరపడి పరిశోధనా సంస్థలను పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం రంగంలోకి దిగింది. కరోనాకు భిన్నంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఒక్కసారిగా బాధితులు రావడం డాక్టర్లను ఆశ్చర్యపరిచింది.
ఆ అంతుచిక్కని వ్యాధితో 3 నుంచి 5 నిమిషాల వరకు మూర్ఛ రావడం, కొంత మందికి కొద్ది నిమిషాల పాటు జ్ఞాపక శక్తి పోవడం, విపరీతమైన టెన్షన్, వాంతులు, తలనొప్పి, వెన్ను నొప్పి వంటి అనేక లక్షణాలు వందల మందిని బాధించాయి.
ఈ మిస్టరీకి సంబంధించి ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), మరికొన్ని పరిశోధనా సంస్థల నిపుణులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. సీసం, నికెల్ వంటి భార లోహాలు ఈ పరిస్థితికి కారణమని కనుగొన్నారు. బాధితుల రక్త నమూనాల్లో భార లోహాలను కనుగొన్నారు. అయితే, ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ పదార్ధం ద్వారా మనుషులలోకి వ్యాపించాయి? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
తాగునీరు, పాల నుంచే!
తాగునీటి నమూనాల్లో సీసం, నికెల్ ఉన్నట్టు కొన్ని వార్తా సంస్థలు ఎయిమ్స్ నిపుణుల కమిటీ నివేదికను ఉటంకిస్తూ రాశాయి. ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటన కూడా ఇందుకు బలం చేకూర్చేలా ఉంది. ‘‘బాధితులకు నిర్వహించిన పరీక్షలు, అలాగే ఆప్రాంతంలో నీళ్లు, పాలకు నిర్వహించిన పరీక్షలు.. వీటన్నిటి ఫలితాలను ఓ నివేదిక రూపంలో పొందుపరచి తనకు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, అంతకు ముందే పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తాగునీరు, పాలు వ్యాప్తి కారకాలు కాదని తేలినట్టు చెప్పడం గమనార్హం. తాగునీరు, పాల నమూనాలను సేకరించి పరీక్షించామని, వాటిలో ఈ భార లోహాలు కనిపించలేదని జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్పారు.
‘‘వ్యాప్తికారకం ఖచ్చితంగా నీరు, పాలు కాదు. ఇతర పదార్ధాలు కావచ్చు. కూరగాయలు ఒక కారకం అయ్యే అవకాశం ఉందనుకుంటే, ఇప్పటికే మేము వాటిని కవర్ చేశాము. ఇంకా స్వీట్స్ వంటి అనేక ఇతర కారకాలు ఉన్నాయి’’- హిమాంశు శుక్లా, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్.
ఏది వ్యాప్తి కారణమో తేల్చడానికి నిపుణులు ఎలిమినేషన్ పద్ధతిని పాటిస్తున్నారు. ఒక్కోదాన్ని పరీక్షించి ప్రక్కన పెడుతున్నారు. కూరగాయల నమూనాలను హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)కు, ఇతర నమూనాలను ఢిల్లీకి పంపారు. వాటితోపాటు ఐఐసిటి నివేదిక కూడా రావలసి ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) నిపుణులతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ నియమించిన ముగ్గురు సభ్యులు టీమ్ మంగళవారం ఏలూరులో ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నీటి నమూనాలను సేకరించింది.
550 మందికి పైగా ఆసుపత్రి పాలైన ఈ హఠాత్ ఉత్పాతానికి మూలం ఎక్కడుందో, నీరు-పాలు వ్యాప్తి కారకాలు కాదన్న ప్రభుత్వ అధికారుల మాటల్లో నిజమెంతో, మనుషుల రక్తం భార లోహాలతో కలుషితం కావడానికి కారకులెవరో ఇంకా తేలాల్సి ఉంది.