Featured

కొత్త ‘పార్లమెంటు’కు 10న ప్రధాని శంకుస్థాపన

భారత నూతన పార్లమెంటు భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న పునాది రాయి వేస్తారని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఆధునిక పరికరాలతో భూకంప-సురక్షితంగా నిర్మించే ఈ భవనంలో సంయుక్త సమావేశాలలో 1,224 మంది వరకు కొలువుదీరేలా వసతి ఉంటుందని స్పీకర్ తెలిపారు. ఓం బిర్లా ఈ విషయమై శనివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.

లోక్ సభ 888 సీట్లతో, రాజ్యసభ 384 సీట్లతో కొలువుదీరతాయని స్పీకర్ చెప్పారు. ‘‘ప్రస్తుత ప్రజాస్వామ్య దేవాలయం 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంటోంది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఆనుకొని నిర్మించే కొత్త భవనం 22 నెలల్లో పూర్తవుతుందని స్పీకర్ చెప్పారు. ప్రధానమంత్రి భూమిపూజతో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు ‘ఆత్మ నిర్బర్ భారత్’కు చిహ్నంగా, ‘ప్రజాస్వామ్య దేవాలయం’గా ఉంటుందని స్పీకర్ చెప్పారు.

కొత్త భవనం, ఎంపీలు అందరికీ కార్యాలయాలు అనే డిమాండ్లు చాలా కాలంగా పెండింగులో ఉన్నాయని, నూతన నిర్మాణాలతో వాటికి పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. శ్రమశక్తి భవనం స్థానంలో జరిగే నిర్మాణంలో 2024 నాటికి ఒక్కొక్క ఎంపీకి 40 చదరపు మీటర్ల చొప్పున కార్యాలయ స్థలం వస్తుందని, ఆ భవనానికి పార్లమెంటు భవనం నుంచి భూగర్భ మార్గం ఉంటుందని వివరించారు.

దేశం 75 స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే సమయానికి పార్లమెంటు శీతాాకాల సమావేశాలను నూతన భవనంలో నిర్వహిస్తామని ఓం బిర్లా ధీమా వ్యక్తం చేశారు. రూ. 971 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు అంతస్థులలో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో నూతన భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించనుంది.

దేశం నలుమూలలనుంచి కళాకారులు, శిల్పులు ఈ భవనానికి తోడ్పాటును అందించనుండటం, వైవిధ్యాన్ని చాటుతూ ‘ఆత్మ నిర్భర్ భారత్’కు చిహ్నంగా మలచడం గర్వకారణమైన అంశంగా ఓం బిర్లా చెప్పారు. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని భావి తరాల కోసం సంరక్షిస్తామని పేర్కొన్నారు.