Featured

టీకా తీసుకున్న హర్యానా మంత్రికి కరోనా!

కోవిడ్ టీకా ప్రయోగాల్లో భాగంగా భారత్ బయోటెక్ రూపొందించిన ‘కోవాక్సిన్’ తీసుకున్న హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలలో పాజిటివ్ ఫలితం వచ్చిందని శనివారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపింది. టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకడం ఏమిటి? టీకా విఫలమైందా? అనే ప్రశ్నలు తెలెత్తాయి.

అయితే, సామాజిక మాథ్యమాల్లో జరుగుతున్న చర్చకు కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. ‘‘వ్యాక్సిన్ రెండవ మోతాదు తీసుకున్న తర్వాత నిర్దిష్ట రోజులు గడిచాక మాత్రమే మనుషులలో సంక్రమణకు వ్యతిరేకంగా ప్రతిరోధకాలు ఏర్పడతాయి, ఎందుకంటే ఇది రెండు డోసుల టీకా. మంత్రి టీకా మొదటి డోసు మాత్రమే తీసుకున్నారు.’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.

దీనిపై భారత్ బయోటెక్ కూడా స్పందించింది. రెండు డోసుల తమ టీకాను 28 రోజుల వ్యవధిలో ఇస్తున్నామని, రెండో మోతాదు వేసిన 14 రోజులకు టీకా సామర్థ్యాన్ని మదిస్తున్నామని వివరించింది. ‘‘రెండు డోసులు తీసుకున్నప్పుడు సమర్ధవంతంగా పని చేసేలా కోవాక్సిన్ రూపొందింది. టీకా అభివృద్ధిలో భద్రత మా ప్రాథమిక ప్రమాణం’’ అని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

‘కోవాక్సిన్’ దేశంలోని 25 ప్రాంతాల్లో 26,000 మందిపైన ప్రయోగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్ బయోటెక్ అత్యంత మెరుగైన ట్రాక్ రికార్డుతో ఇప్పటిదాకా 80 దేశాలకు 400 కోట్లకు పైగా డోసులను సరఫరా చేసిందని ఆ ప్రకటన పేర్కొంది.