Andhra Pradesh

పోలవరం ఎత్తు తగ్గించే అధికారం ప్రభుత్వాలకు లేదు

పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఎత్తును తగ్గించే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని నీటిపారుదల రంగ నిపుణులు అక్కినేని భవాని ప్రసాద్ ఉద్ఘాటించారు. పోలవరం ఎత్తు 150 అడుగులుగా బచావత్ అవార్డులో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై జనచైతన్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ కమిటీ ఆదివారం (ఆగస్టు 27) గుంటూరులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో భవాని ప్రసాద్ మాట్లాడారు. ఈ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లoరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తే నీటి నిల్వ సామర్థ్యం 196 టిఎంసిల నుండి 75 టిఎంసిలకు తగ్గుతుందని, కుడి-ఎడమ కాలువలకు గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించదని భవాని ప్రసాద్ చెప్పారు. లక్ష మందికి పైగా ఉన్న నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పూర్తి నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి వుందని ఆయన స్పష్టం చేశారు.

1835 లోనే సర్ ఆర్థర్ కాటన్ గోదావరిపై రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించారని, 1941లోనే మద్రాసు రాష్ట్ర ప్రధాన ఇంజనీర్ దివాన్ బహదూర్ ఎన్ వెంకటకృష్ణ అయ్యర్ పోలవరం ప్రాజెక్టును ప్రతిపాదించారని,1946-47 లో ప్రముఖ ఇంజనీర్ కెఎల్ రావు రామపాద సాగరంగా పేర్కొన్నారని, 2005 లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి త్వరిత గతిన పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారని, 2009 నాటికి అన్ని అనుమతులు పూర్తి చేశారని, ప్రధాన కాలువలను పూర్తి చేశారని భవాని ప్రసాద్ వివరించారు. 2014 నుండి 2019 వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరిగిందని, అప్పట్లో 72% ప్రాజెక్టును పూర్తి చేస్తే గత 50 నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు శాతానికి మించి పనులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

2014-2019 మధ్య నాటి ప్రభుత్వం పోలవరంపై రూ. 11,450 కోట్లు ఖర్చు చేయగా నేటి ప్రభుత్వం గత 50 నెలలలో రూ. 4450 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, ఉద్యమకారుడు టి. లక్ష్మీనారాయణ విమర్శించారు. నిర్వాసితులకు పునరావాస కల్పన కోసం రూ. 33 వేల కోట్లు చెల్లించాల్సి వుందని, అయితే ఇప్పటివరకు 7000 కోట్లు మాత్రమే చెల్లించారని ఆక్షేపించారు. నిర్వాసితుల్లో 55% గిరిజనులు ఉన్నారని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టును త్వరతగతిన పూర్తి చేయడానికి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోతున్నదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటి కార్యాలయాలను వెంటనే హైదరాబాదు నుండి రాజమండ్రికి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మించిన సంక్షేమ కార్యక్రమం మరొకటి లేదని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఉద్ఘాటించారు. కోట్లాది ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే జీవనాడి పోలవరం అని ఆయన అభిప్రాయపడ్డారు. రూ. 10 లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్ల ధనాన్ని నేరుగా ప్రజల ఖాతాల్లోకి పంపిన విషయాన్ని గుర్తు చేసిన లక్ష్మణరెడ్డి, ఆ మొత్తంలో 20 శాతం నీటిపారుదల ప్రాజెక్టులపై వెచ్చిస్తే ఆంధ్రప్రదేశ్ లోని 106 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యేవని పేర్కొన్నారు.

Related Posts