పోలవరం నిర్వాసిత కుటుంబాలకు కేంద్రమే నగదు బదిలీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ప్రతికూల స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టు ఆమోదానికి అనుగుణంగా లేదని జలవనరుల శాఖ మంత్రి గురువారం లోక్ సభలో తేల్చి చెప్పారు.
వైసీపీ ఎంపీ వంగా గీత అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘పోలవరం నిర్వాసిత కుటుంబాలకు నేరుగా నగదు బదిలీ చేయాలని 2022 ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మంత్రిత్వ శాఖకు విన్నవించింది. అయితే, ఈ సూచన.. ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రమే చేపట్టేలా భారత ప్రభుత్వం ఇచ్చిన ఆమోదానికి అనుగుణంగా ఉన్నట్టు మేం భావించలేదు’’ అని వివరించారు.
ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి బిల్లులను తిరిగే చెల్లించే విషయంలో ఎలాంటి జాప్యమూ జరగడం లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు.. ప్రాజెక్టు భూసేకరణకోసం రూ. 3431.59 కోట్లు, పునరావాసానికి రూ. 2110.23 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి లోక్ సభలో వెల్లడించారు.
భూసేకరణ, పునరావాసం సహా అనుమతించిన ఖర్చులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యమూ లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా భూసేకరణ కింద రూ. 3,779.5 కోట్లకు, పునరావాస పనుల కింద రూ. 2,257.29 కోట్లకు బిల్లులు సమర్పించినట్టు వివరించారు.